దీపావళి.. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ. ఇంట్లోకి నూతన వెలుగులు తీసుకొచ్చే మహత్తర పండుగ. అందిర ఆరోగ్యం, సంతోషాన్ని కోరుకుంటూ సెలబ్రేట్ చేసుకునే పర్వదినం. మతంతో సంబంధం లేకుండా చాలా వరకు అందరూ కలిసి ఆనందోత్సాహంతో దీపావళి జరుపుకుంటారు. ఆశ్వయుజ బహుళ అమవాస్య రోజు ఈ పర్వదినం వస్తుంది. ఈ ఏడాది నవంబరు 14 శనివారం నాడు జరుపుకోనున్నారు. అయితే అసలు ఈ పండుగ విశిష్టత ఏంటి? పౌరాణిక చరిత్ర ఉందా? లాంటి ప్రశ్నలకు సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం.
దీపావళి ఎందుకు జరుపుకుంటారంటే.
రామాయణంలోనూ దీపావళి ప్రస్తావన ఉంది. పురాణ కథనం ప్రకారం.. భూదేవి, వరహా స్వామికి అసుర సమయంలో జన్మించిన నరకాసురుడు.. శ్రీహరి చేతిలో చావులేని విధంగా తల్లి చేతిలోనే మరణించేలా వరం పొందుతాడు. వరగర్వంతో లోకకంటకుడిగా తయారైన నరకుడు ముల్లోకాలను పట్టిపీడించాడు. నరకాసురుడి బాధలు భరించలేని దేవతలు, మునులు, గంధర్వులు శ్రీహరికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. వారి మొర ఆలకించిన శ్రీమహావిష్ణువు ద్వాపర యుగంలో కృష్ణుడిగా అవతరించి సత్యభామతో నరకాసురుని సంహరింపజేశాడు. నరకాసుర సంహారంతో అందరూ అనందంగా పండుగ చేసుకున్నారు. చతుర్దశి నాడు నరకుడి మరణించగా, ఆ తర్వాత రోజు దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారు. దీపావళి అంటే దీపాల వరుస అన్ని అర్థం. కొన్ని ప్రాంతాల్లో దీపావళిని ఐదు రోజుల పండుగగా జరుపుకుంటారు. ఆశ్యయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమైన దీపావళి వేడుకలు.. కార్తీక శుద్ద విదియ ‘భగినీహస్త భోజనం’’తో ముగుస్తుంది.