“అ ఉ మ” అనునది త్రిమూర్త్యాత్మకము
“అ” తండ్రిని సూచిస్తుంది.
“ఉ” కుమారుని సూచిస్తుంది.
“మ” తల్లిని సూచిస్తుంది.
ఓం అనుదానిని సూచించుటకు ఎటువంటి అంకె లేదు, అన్ని అంకెలును ప్రణవము నుండియే ఉద్భవించును. అన్ని అంకెలకు ఇది మూలము. ప్రణవమునకు ఒక వర్ణమనునది లేదు. అన్ని వర్ణములకు ఇదే మూలము.
ఓంకారమునకు ఎటువంటి చిహ్నము లేదు, అన్ని చిహ్నములు అందునుండే ఉద్భవించినవి. మన రూపములన్నియు ఓంకారము యొక్క చిహ్నములే.
ఓంకారమును ఊర్థ్వమునుండి, అధస్సునకు, అధస్సు నుండి ఊర్థ్వమునకు, అంతరంగమునుండి బాహ్యమునకు, అలాగే బాహ్యమునుండి అంతరంగమునకు న్యాసము చేయవచ్చును. మనమందరము ప్రణవము (ఓంకారము) నందే ఉన్నాము, మరియు మనందరియందు ఓంకారము ఉన్నది.
ఓంకారమును అన్ని సమయములందు ఉచ్చరించవచ్చును. ఉభయ సంధ్యలు ఉత్తమమైన సమయములుగా చెప్పబడినవి. హృదయ కేంద్రము నందు కాని, భ్రూమధ్యమున కాని ఓంకారము ధ్యానము భావించుచూ చేయవచ్చును.
ఓంకారమును మన యందును, మన చుట్టును భావించుచూ మనముగా అనుభూతి చెందవలెను. మనలను ఓంకారముతో నింపుకొని మనము ఓంకారము కావలెను.
ఓం అనునది ప్రజ్ఞ-పదార్థమునకు చెందిన రెండు విధములైన ధ్వనులు అన్ని లోకములయందును, అన్ని స్థితుల యందును విడదీయరానివై ఉండుటను సూచించును.
ఓం నుండి వచ్చు ఒకే ఒక ధ్వని విశ్వాధారమైన ఉనికితో కలసి ఉండుటను సూచించును.
ఓం అనునది అన్ని శబ్దములకు మూలము మరియు ధ్వనించని శబ్దము, అనాహతము. ఇది శాశ్వతము.
ఓం అనునది నిలచిపోయినపుడు, ఈ విశ్వము అంతమగును – అనగా, విశ్వము అవ్యక్తములోనికి ఉపసంహరింపబడును.
ఓంకారము సృష్టిలోని అన్ని లోకములయందును నిర్ణీత కాలవ్యవధిలో ఉచ్చరింపబడుట, ఉచ్చరింపబడకుండుట పునరావృతమగుచుండును.
ఓం అనునది ప్రాణ సూత్రమై అన్నింటిని కలిపి ఉంచును.
ఓం ను శ్రద్ధతో ఉచ్చరించి, శబ్దమును అనుసరించి దాని పుట్టుక స్థానమును గమనించవలెను. అప్పుడు నీవు ఉచ్చరింపబడని (అనాహత) శబ్దమును చేరుకొందువు.
ఓం అనునది ఉచ్చరింపబడుటలేదు, అది జరుగుచున్నది – ఉచ్చారణ ప్రణవము వలననే జరుగుచున్నది.
ఓంకారమును నీలోనే నీవుగా గ్రహించవలెను – నీవు యథార్థముగా ఓం కంటే వేరుకాదు.
ఓం ను 3,5,7 లేక 21 సార్లు ఉచ్చరించవలెను. అది నీ త్రికరణములను పునర్వ్యవస్థీకరించి ప్రకృతితో అనుసంధానించును.
ఓం ను ఉచ్చరించి వినుము. ఉచ్చరించిన తరువాత కూడా వినవలెను! ఆవిధముగా వినుటవలన అది ఓం లోనికి కరిగిపోవుటకు మార్గమిదియే. తదుపరి ఓం మాత్రమే మిగులును.
ఓం అనునది విశ్వమునందలి అక్షరమాలలోని అక్షరములకు ఆవల ఉన్న అక్షరము. సమస్త జ్ఞానము ఈ అక్షరము నుండియే కొనిరాబడినది. ఇది వేదములకు వేదము. ఇది అన్ని శాస్త్రముల యొక్క సారము.
ఓంకారమును నీవుగా అని భావన చేయుము. ఓం “నేను”గా తెలుసుకొనుము. నీ ప్రవృత్తులన్నియు ఓం లోనికి ఉపసంహరించుము. సమస్త సృష్టికి ఆవల “నేను”గా నిలతువు.