అనుభవిస్తున్నంత కాలం పరమాత్మ చింతన కలిగి ఉండటం కష్టమే. మామూలుగా ఆపద సమయాల్లో మాత్రమే భగవంతుడు గుర్తుకొస్తాడు.
? జీవితం కష్టసుఖాల సంగమం. కష్టాల్లో సైతం మద్యపాన వ్యసనానికి దాసులైన వారికి భగవంతుడు జ్ఞప్తికి రాడు. అజ్ఞానాంధకారంలో కొట్టుమిట్టాడుతూ పశుతుల్యంగా జీవితాన్ని గడుపుతుంటారు వీళ్లు.
? ”జాతస్యహి మరణం ధృవమ్’’ అన్నారు. పుట్టినవాడు గిట్టక తప్పదు. ఈ భూమీద పడ్డ ప్రతీ జీవినీ ప్రతీక్షణం మృత్యువు కనిపెట్టుకునే ఉంటుంది. కనుక వ్యర్థంగా కాలంగడపకుండా దైవచింతన కలిగి ఉండటం ఎంతైనా అవసరం.ఉత్కృష్టమైన మానవజన్మ ఎత్తికూడా అనివార్యమైన భగవత్ప్రేమకు పాత్రులు కాకపోవడం ఆత్మహత్యా సదృశం.
? అభ్యాసం ఉంటే తప్ప ఎవరికి పరమాత్మ చింతన అలవడదు. అది ఇసుమంతైనా లేకపోగా”ఏమి తిందామా! ఏమి త్రాగుదామా!”అనే యావతో జీవితాన్ని వృథా చేసుకునే వాళ్లకెంత ఆయుష్షుంటే ఏం లాభం? అది హారతికర్పూరంలా కరిగిపోతూనే ఉంటుంది కదా!
? ఈశ్వరోపాసనకి పూజ, ప్రార్థన ముఖ్య సాధనాలు. మన స్థూల శరీరానికి కర చరణాదులు ఎలాగో అలాగే ఆత్మకు జ్ఞానాదులు అలాంటివి. లోకంలో జనులు దేహం మీదున్న అభిమానం చేత సర్వసుఖాల్ని పొందడంకోసమే ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారే తప్ప ఆత్మానంద సుఖంకోసం గాని, సంసార బంధ విముక్తులు అవడానికిగాని యత్నించరు. కాగా “ఎవరినెట్లా పీడించాలా?”అనే పైశాచిక ప్రకృతిని ఒంటబటించుకుంటున్నారు. అందువల్లే ఉత్కృష్టమైన ఈ మానవజన్మ వ్యర్థవౌతోంది.
? ఆత్మను పోషించుటకు, రక్షించుటకు పరమాత్మ చింతనే ముఖ్యసాధనమనేమాట నిర్వివాదాంశం. అడగనిదే అమ్మైనా పెట్టదంటారు. అలాగే భగవంతుణ్ణి తలంచని వాణ్ణి ఆ దేవుడు కరుణించడు. ముక్తినివ్వడు. పండితులు, భాగవతులు తమ గానం చేత, పూజాది సత్కర్మలచేత జపతపముల చేత భగవంతుణ్ణి అనేక రకాలుగా స్తుతిస్తారు.
? రాజదర్శనం కావాలంటే ముందుగా భటుని దర్శించవలసి ఉంటుంది. తోటలోని ఫలాలు కావాలనుకుంటే ముందుగా తోటమాలిని ఆశ్రయించాలి. అలాగే భగవంతుణ్ణి గురించి తెలుసుకోవాలనుకుంటే ముందు భాగవతుల్ని ఆశ్రయించాలి. అది సాధ్యంకానప్పుడు సత్పురుష సాంగత్యమైనా చెయ్యాలి. అది కూడ దుర్లభం అనుకుంటే తన దుష్టప్రవర్తనను తానే సరిదిద్దుకోగలగాలి. అందుకు శుభాశుభములు తెలుసుకోవాలి. అవి తెలుసుకోవాలంటే వివేకం ఉండాలి. వివేకం కలగాలంటే ముందు తను నీతిగా ఉండాలి. అందుకు విద్య అవసరం. విద్య అంటే ఆ సర్వేశ్వరుని మార్గాన్ని తెలుసుకోవడమే. తప్ప పొట్టకూటికోసం విద్యలుకావని గ్రహించాలి. ఈశ్వర చింతన యందు అభిలాష ఉంటే విజ్ఞానవంతులవుతారు.
? మనమంతా పుణ్యంకోసం నదీస్నానాలు, గుళ్ళు గోపురాల దర్శనం చేస్తుంటాం. ఇవన్నీ బాహ్యేంద్రియ శుద్ధి చేసేవే గాని ఆత్మశుద్ధికి తోడ్పడవు. వాటన్నిటికంటె ముందు శుభకర్మల్ని ఆచరించాలి. పరోపకారం, సత్యం పలకడం, భూతదయ, సత్‌సాంగత్యం, దానాదిక ధర్మాలు, ఈశ్వర స్తుతి వంటి ఉత్తమగుణాలే శుభకర్మలు అనబడతాయి. శుభకర్మలు చేసేందుకు అలవాటుపడని వాళ్ళంతా ఈ భూమ్మీద నడుస్తున్న శవాలే.
ఓం నమశ్శివాయ
?సర్వేజనాసుఖినోభవంతు ?