కుండలిని అంటే యోగవిద్య నేర్చుకునే వారికి అత్యంత పరిచయం అయిన పేరు . కుండలిని అనే శక్తి వెంట్రుక కంటే సన్నని రూపంలో చుట్టలు చుట్టుకుని వెన్నుపాము కిందిభాగంలో ఉంటుంది అని కొంతమంది చెబుతారు. ఇది నిద్రావస్థలో ఉంటుంది. ఎప్పుడైతే నిద్రావస్థలో ఉన్న కుండలి సరైన గురుప్రసాదం వలన మేలుకొని సకల పద్మాలు అనగా చక్రాలను చీల్చుకొని పోవుతుందో అప్పుడు కుండలిని నిద్రావస్థ నుంచి జాగరణావస్థ లోనికి వచ్చింది అని తెలుసుకొనవలెను.
Omkaram-Guruji-Contact-9059406999
ఈ కుండలినికి అనేక నామములు కలవు. కుటిలాంగి , భుజంగి, శక్తి, ఈశ్వరి, కుండలిని , అరుంధతి , కుండలి అను పేర్లతో వివిధ యోగ గ్రంథాలలో పిలుస్తారు . కుండలిని శక్తి మేల్కొనని యెడల సర్వయోగ సాధనలు వ్యర్ధములు అగును. ఈ కుండలిని అనేది వెన్నుపాము కిందభాగములో సర్పాకృతిని పొంది నిద్రావస్థలో ఉన్న ఒక సూక్ష్మ నాడి . ఇది సమస్త శక్తి మహిమలకు , సమస్త జ్ఞాన , విజ్ఞానములకు ఆధారభూతం అయిన కేంద్రస్థానం . ఈ కుండలినీశక్తి మేల్కొననంత వరకు మానవుడు అజ్ఞానిగానే ఉంటాడు. కుండలిని జాగరణ అయిన కొద్దికాలంలోనే పూర్ణమైన ఙ్ఞానమును , సమస్త మహిమలు కలుగును.
కుండలిని శక్తిని ప్రాణాపానైక్యము అను సాధన ద్వారా మేల్కొనపవచ్చు . ఈ సాధన సద్గురువు యొక్క శక్తిపాతము వలన కలిగే ధ్యానావస్థ యందు సహజముగా కలిగే భస్త్రికా ప్రాణాయామం వలన కలుగును. ఈ సాధన యోగమార్గ రహస్యాలు తెలిసిన సద్గురువు వలన నేర్చుకుని చేయవలెనే కాని సొంతప్రయత్నముతో చేయరాదు . అలా చేసినచో చాలా అపాయకరమైన పరిస్థితులను కలిగించును. నాజీవితములో అలా ప్రయత్నించి కుండలిని శక్తి మేల్కొనిన తరువాత దానిని అదుపు చేయలేక పిచ్చివారు అయిన వారిని మరియు తీవ్రంగా మలబద్దకం సమస్య పొందిన వారిని చూశాను .
కుండలిని జాగరణ సరైన పద్దతిలో జరిగినవాడు గొప్ప లాభమును , శక్తిని ఎలా పొందునో అలానే కుండలిని జాగరణ సవ్యముగా జరగక ఏమైనా విషమ సమస్య కలిగినచో మనోమయ , విజ్ఞానమయ కోశములు ఈ జన్మలోనే కాకుండా ఇంకా కొన్ని జన్మల వరకు సాధన చేయుటకు నిరుపయోగము అగుటయే కాకుండా సాంసారిక కార్యక్రమాలకు కూడా పనికిరాకుండా అనేక విధములు అయిన మానసిక , భౌతిక దోషముల చేత ఉన్మాదాది రోగములచేత పీడితుడు అగును. కావున పూర్ణపురుషుడు అయి సరైన సద్గురువు దొరికినప్పుడే కుండలిని జాగరణ సాధనలు చేయవలెను . మంత్రజపముల వలన కూడా కొన్ని ఙ్ఞాన నాడుల మీద ప్రత్యేకమైన ప్రభావము కలిగి తద్వారా కుండలిని జాగరణ కలిగినప్పుడే మంత్రసిద్ది , ఇష్ట దేవతా సాక్షాత్కారము కలుగును. ఇటువంటి సాధనలు చేయుటకు ఆరోగ్యముగా ఉండటం కూడా అత్యంత ప్రధానం
కుండలిని శక్తి గురించి చెప్పేటప్పుడు శక్తిచాలనము గురించి కూడా తెలుసుకోవాలి . పరిపూర్ణుడు అయినటువంటి మనుష్యుడు యోగసాధన ద్వారా ఈ కుండలిని శక్తిని మేల్కొలపాలి. ఈ విధానం గురించి యోగులు ఈ విధంగా చెబుతారు . నిద్రచేయునట్టి సర్పమైన కుండలిని యొక్క తోకను పట్టి దానిని మేలుకొలపవలెను . కుండలిని శక్తి నిద్రను విడిచి హఠము చేత మీదికి లేచుచున్నది. ఈ కుండలిని శక్తి పాము వలే వంకరగా చుట్టుకుని ఉండుననియు కందము మీద బ్రహ్మ ద్వారము నందు ముఖమును ఉంచి ద్వారమును మూసుకొని నిద్రించుచుండునని యోగులు చెప్పుదురు.
లింగమునకు మీదుగాను , నాభికి క్రిందగాను , గుదస్థానమునకు పన్నెండు అంగుళముల పైన , నాలుగు అంగుళముల వెడల్పును , అదే పొడుగును కలదై గుడ్డు వంటి కందము ఉండును. ఈ కంద స్థానం నుండియే 72000 వేల నాడులు బయలుదేరుతున్నవి . వజ్రాసనమున ఉండి రెండు చేతులతో కాలి మడమలకు సమీపమున రెండు పాదములను దృఢముగా పెట్టి ఈ రెండు పాదముల చేత కంద స్థానమునందు ఉండు కందమును చక్కగా పీడించవలెను . ఇట్లు పీడించుటచే కుండలిని చాలనం అగును. ఇక్కడ చాలనం అనగా నిద్రపోవుచుండెడి కుండలిని శక్తిని మూలాధారం నుండి ఊర్ధ్వముఖమునకు చలింపచేయుట లేక తీసుకొనిపోవుట . ఈ రహస్యము గురుముఖంగా తెలుసుకొనదగినది. ఈ కుండలిని శక్తిని చాలనము చేయుటకు అనేక మార్గములు కలవు. ఇట్టి విధానములు అన్నియు రహస్యముగా గురుసన్నిధిలోనే నేర్చుకొనవలెను.
ఏకాగ్రత చిత్తముతో గురుపదేశమగు రీతిని ప్రాణాయామము చేయుటచే గూడ కుండలిని శక్తిని చాలనము చేయవచ్చు . ఈ శక్తిని చాలనము చేసి ప్రాణశక్తిని తన స్వాధీనము నందు ఉంచుకొనిన యోగి అణిమాది సిద్ధులను సాధించుచున్నాడు. ఇట్టి కుండలిని శక్తిని సాధించిన కాస , శ్వాస , జ్వరాదిరోగములు ఎప్పటికి బాధించవు . ఇట్టి మహాముద్రాది కరణముల చేత , నానావిధములగు ఆసనముల చేత , కుంభకముల చేత కుండలి మేల్కొన్నప్పుడు ప్రాణవాయువు శూన్యం అనెడి బ్రహ్మరంధ్రమునందు లయమగుచుండెను .
కుండలిని శక్తి గురించి సంపూర్ణంగా మీకు వివరించాను . తరవాతి పోస్టులో మీకు శరీరము నందు గల చక్రాల గురించి వివరిస్తాను.