జీవితంలో తల్లి తండ్రుల పాత్ర ఇరవై ఏళ్ళు వరకు మిగతా ఎనభై అంతా భర్త / భార్య తో బండి నడిచిపోతూ ఉంటుంది.
జన్మ కర్మల తో ఈ మూడు మనస్తత్వాలు మనకు జతగా వచ్చేస్తాయి.
తటస్దులు,
స్నేహితులు,
శత్రువులు
అని మూడు రకాలు.
మా తాతగారు ఎప్పుడూ ఒక మాట చెపుతూ ఉండేవారు . “మంచి కూడులోకి మంచి కూరదొరకదు. మంచి గూడులో మంచి తోడు దొరకదు అని”
ఈ జంటలో ఎనభై శాతం “అర్దం చేసుకునే మనసు లేక , మానసిక దగ్గరితనం లేక తప్పక, తప్పించుకోలేక” ముక్తసరిగా, ముభావంగా” తటస్దులు గా జతగా దొరికేస్తూ ఏదో స్దబ్దతగా జీవితం ముగిసిపోతూ ఉంటుంది.
సమాజంలో ఎందరినో చూస్తూ ఉంటాము. భార్య భాధ్యతగా ఇల్లు సంసారం దిద్దుకుంటూ వినయ విధేయతలతో ఉంటే
” భర్త ఓ జూదరో, త్రాగుబోతో తిరుగుబోతో అయి హింసిస్తూ, వేదిస్తూ నరకం ఇక్కడే ఉందా అన్నట్లు భార్య బ్రతికేస్తూ.
”ఇక భర్త ఉత్తముడయితే భార్య పరమ రాకాసి, సంపాదనకోసం వేదించడమో, అనుమానం తో వేదించడమో” ఇంటికి రావాలంటే విరక్తి కలిగే అంతలా.
శత్రువులు జతగా దొరికేస్తూ ఎవరికివారే మనసుకు శాంతి లేక జీవితాన్ని ఈడ్చేస్తూ బ్రతికేస్తూ ఉంటారు. సమాజంలో కోసం సమూహం కోసం గదులకు దగ్గరగా మదిగదికి దూరంగా బ్రతికేస్తారు.
ఎక్కడో, ఎప్పుడో ఓ జంట ఉంటారు. వీరిది స్నేహబంధం. వీరు మాత్రం జన్మ జన్మల అనుబంధం, ఒకరికి ఒకరులా ఒకరికోసం ఒకరులా మేనులు వేరైనా మనసులు ఒక్కటిలా, మిధునం లా మధురంగా జీవించేస్తారు.
మరో పది శాతం కొందరు భర్తలు దూరమై, మరికొందరికి భార్యలు దూరమై, జీవితానికి అర్దం పరమార్దం లేక కదిలే కాలంతో మౌనమనే తోడుతో అశ్రువుల ఆవలితీరం చేరాలని వెతికేస్తూ. ముగిసిపోయిన చరిత్రను పాళీలేని పెన్నుతో ఏదో రాయాలని ఆరాటం ”బ్రతుకంతా పోరాటం” కాలమనే గాలనికి చిక్కి మాననీ గాయాలతో
కలగానో కధగానో కల్పనగానో కలవని దిక్కులుతో కాలం నెట్టేస్తారు.
ఇవొక శాపగ్రస్త జీవితాలే.
కార్యా, కారణ సంభంధమో, జన్మ, కర్మ ఫలితాలో, తీరని రుణాలో పెనవేసిన బంధాలో, విడలేని భాధ్యతలో భార్య / భర్త / బిడ్డలు. కాబట్టి ఇక్కడ శాంతి లేదు. అక్కడ ఏదో ఉంది అని శేషఋణం తీర్చుకోకుంటా ఎక్కడికో పరుగులు తీస్తే ఎలా?
దూరపు కొండలు ఎప్పుడూ నునుపే.
నీతో జతకలిసే రక్త బంధాలు, స్నేహబంధాలు, పేగుబంధాలు, అన్నీ రుణాలే.
కొన్ని తీర్చుకోలేనివి. మరికొన్ని అనుబవించవలసినవి. ఇక్కడికి వచ్చినందుకు ఈ అందమైన నాటకంలో నీకు ఇచ్చి పాత్ర అద్బుతంగా పోషించేయ్. నీ పాత్ర ఏదన్నాకాని. ఈ ప్రస్దానంలో కర్తవ్యం నీవంతు. దేహ ధర్మాలు ఆచరించి, నాటకం ముగిపోయే నాటికి ఒక్కసారి నీకు విశ్లేషించుకుంటే నా దేహానికి ఉన్న బంధాలు అనుబంధాలతో నా పాత్ర సక్రమంగా పోషించానా లేదా. ఇక శేష రుణాలు ఏమైనా ఉన్నాయాలేదా అని పరికించుకుని, పయనించడమే జీవితం.
ఇక నీ పాత్రకు సుఖం ఉందా?
సంతోషం ఉందా?
ఆనందం ఉందా?
అని విచార పడితే ఎలా?
ఆనాడు పెట్టి ఉంటేనే కదా, ఇప్పుడు పుట్టుదల.
నీకు నువ్వు నిర్ణయించుకుని వచ్చిన జీవితం ఎరుకతో జీవించేస్తూ కర్తవ్యాన్ని నిర్వహిస్తూ ఇదేదీ నాది కాదని గ్రహిస్తూ, అన్నీ వాని ప్రసాదమే అని నీ ధర్మం నువ్వు చేసేస్తూ కర్మ యోగిలా కదిలిపోతూ, పాత్రలో జీవించేయ్ ” ఈ పాత్ర నువ్వు తప్ప ఎవరూ పోషించలేనంతగా అద్బుతంగా. ఉన్నదంతా బ్రహ్మమని. బంధము భ్రాంతిచేతనని.